15 January 2011

ఎనభైల్లో సంక్రాంతి

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ముఖ్యంగా గొబ్బిళ్ళే గుర్తుకొస్తాయి. తెల్లారుగట్లే ఆవు పేడ కోసం వేట. ఊరి నిండా గేదెలే, ఆవులు తక్కువైపోయాయి అప్పటికే. కరణం గారి కొష్టంలో ఒక ఆవు, భువనేశ్వరి అత్తయ్యగారి పెరట్లో ఒక ఆవు, శ్రీరామనిలయం గోశాలలో రెండు ఆవులు - ఇంతే. వూళ్ళో ఉన్న గొబ్బిళ్ళ వయసు అమ్మాయిలు పాతికమందికీ ఈ నాలుగు ఆవులే పేడ సప్లయ్ చెయ్యాలి, కష్టం కదా. ఆవుపేడ కోసం అర్థరాత్రి రెండింటికి లేచిన రోజులున్నాయి. పరీక్షలకు చదూకోడం కోసం కూడా ఎప్పుడూ అంత తొరగా లేవలేదు నేను. పేడ బాగా దొరికిన రోజు ముప్ఫై చుక్కల పెద్ద ముగ్గు మీద ఐదు పెద్ద పెద్ద గొబ్బిళ్ళుంటే, అంత దొరకని రోజున పదిహేను చుక్కల ముగ్గు మీద చిన్న చిన్న గొబ్బిళ్ళు మూడుండేవి. గొబ్బిళ్ళ మీద కళ్ళన్నీ పూర్తిగా విచ్చుకున్న పెద్ద ముద్దబంతి పూవు సెంటర్ పీస్ ఐతే, చుట్టూ కృష్ణబంతి పూలు, చిన్నసైజు రేకబంతి పూలు వందిమాగధుల్లా పరివేష్టించి ఉండేవి. అవి పేడ గొబ్బిళ్ళో, పూలబంతులో అర్థం కాకుండా అలంకరించి పారేసేవాళ్ళం. సంక్రాంతి నెలలో బెస్ట్ పార్ట్ "సందె గొబ్బిళ్ళు". పొద్దున్న ఎవరిళ్ళలో వాళ్ళు పెట్టుకునే గొబ్బిళ్ళు కావివి. సాయంకాలం పూట గొబ్బిళ్ళు పెట్టి పేరంటం పిలుచుకునే టైప్ గ్రాండ్ గొబ్బిళ్ళు ఇవి. ఈ గొబ్బిళ్ళకి అలంకారం ఆడంబరం చాలా ఎక్కువ. జయంట్ సైజు గొబ్బిళ్ళు కూడాను. పట్టుపరికిణీలు, జెడగంటలు పెట్టుకున్న నాగారం జెడలు, వేసుకుని ఆడపిల్లలంతా పేరంటానికి వెళతారు. గొబ్బిళ్ళు పెట్టుకుంటున్న అమ్మాయి గొబ్బికి పూలు పసుపు కుంకాలతో పూజ చేస్తుంది. పూజయ్యాక అమ్మాయిల బృందమంతా కలిసి గొబ్బి చుట్టూ తిరుగుతూ చప్పట్లు తడుతూ బోలెడు పాటలు పాడతారు - "ఎన్నీయల్లో ఎన్నీయల్లో విత్తూ విత్తూ వేసారంట ఏమి విత్తు వేసారంట, రాజా వారి తోటలో జామవిత్తు వేసారంట", "బుజబుజ రేకుల పిల్లుందా", "సుబ్బిగొబ్బెమ్మా సుబ్బణ్ణీయవే" ఇంకా చాలా పాటలుండేవి. పూజంతా అయ్యాక ప్రసాదం పెట్టేవాళ్ళు. సందెగొబ్బిళ్ళ ప్రసాదాలంతటి రుచికరమైన ప్రసాదాలు నెనెక్కడా తినలేదు. ఆవపెట్టిన చింతపండు పులిహార, సాతాళించిన శెనగలు, తాళింపు వేసిన శెనగపప్పు, రవ్వ పులిహార, అటుకుల పులిహార, చిట్టిగారెలు, పటికబెల్లం పలుకులు పుట్నాల పప్పు అటుకులు కలిపిన మరమరాలు, ఇలా ఉండేవి ప్రసాదాలు.




తెల్లారుగట్ల పూజ అయ్యేంతవరకు మహా భక్తిగా అపురూపంగా చూసుకున్న గొబ్బిని పొద్దున్న మా పనమ్మాయి నూకాలు ఇర్రివరెంట్ గా గోడకి పిడక కొట్టేస్తుంటే ఈక్వల్లీ ఇర్రివరెంట్ గా నేను వేలితో పిడక మధ్యలో కన్నం పెట్టేసేదాన్ని. ఈ నెలంతా ఎండ మీదే దృష్టంతా ఉండేది. ఎండ బాగా వచ్చినరోజు సంతోషంగాను, ఎండ బాగా కాయని రోజున కాస్త దిగులుగానూ ఉండేవాళ్ళం. ఎండ బాగా రాకపోతే గొబ్బిళ్ళ పిడకలు ఎండేదెలా? సాయంకాలం బడినుంచి రాగానే ముందుగా పరిగెట్టేది గొబ్బిళ్ళ గోడ దగ్గరికి. ఆ రోజు ఎండకి ఎంత ఎండాయో, ఎప్పుడు గోడ మీన్నుంచి తీసి దండలు గుచ్చుకోవచ్చో బేరీజు వేసుకునేవాళ్ళం. గోడ మీదుంటే పగలు ఎండకి ఎండినా, రాత్రి పూట కురిసే మంచుకి మళ్ళీ వ్యవహారం మొదటికొచ్చేసేది. ఇలా ప్రాణాలన్నీ గొబ్బి పిడకల మీదే పెట్టుకుని బ్రతికేవాళ్ళం నెలంతా.



సంక్రాంతి నెల్లో ఇంకో విశేషం ముగ్గులు. మా వీధిలో ఉండే రమక్క, వేణక్క పెద్ద పెద్ద ముగ్గులేసేవాళ్ళు. ముప్ఫై బై పదిహేను చుక్కల ముగ్గంటే వాకిలంతా నిండిపోవలసిందే. పక్క వీధిలో ఆంజనేయులు మాస్టారుగారమ్మాయిలు ఉండేవారు జయక్క విజయక్క అని. వాళ్ళు వాళ్ళ వీధిలో దిగ్గజాలు. రమక్క వేణక్క చుక్కలను కలుపుతు వేసే రత్నాల ముగ్గుల్లో ఎక్స్పర్ట్స్ ఐతే, జయక్క విజయక్కలు చుక్కల చుట్టూ ఒకే దారంతో అల్లినట్టుండే ముత్యాలముగ్గులలో ప్రవీణులు. వీళ్ళు పెద్ద పెద్ద ముగ్గులేస్తే, వాళ్ళు కాంప్లెక్స్ ముగ్గులేసేవాళ్ళు. వాళ్ళ వీధికీ మా వీధికీ ఎప్పుడూ పోటీయే. మా వీధి బావుందంటే మా వీధే బావుందని నేనూ వినోదినీ ఎప్పుడూ వాదించుకోడమే. అక్కలని చూసి ఇన్స్పైర్ అయిపోయి నేనూ వేశాను ముగ్గులు. కానీ ఓసారి మా బుల్లిమావయ్య కాలేజీకెళుతూ నా ముగ్గు చూసి "అమీబా వేసావా? బావుందే!" అనేసి సైకిలెక్కి తుర్రుమన్నాడు. ఆ నెలంతా ముగ్గుల పిచ్చి ఎంతగా పట్టేదంటే, ఒక నలభై పేజీల తెల్లకాయితాల నోటుబుక్కు కొని దాన్లో పెన్సిలుతో ముగ్గులన్నీ వేసుకుని దాచుకునేవాళ్ళం. ఉగాది పండగొచ్చేసరికి ఎక్కడో పారేసేవాళ్ళం. ఆ పుస్తకం జాడ కూడా తెలిసేది కాదు. మళ్ళీ యేడాది ఇంకో కొత్త ముగ్గుల పుస్తకం. కానీ జెన్యూయిన్ ముగ్గుల ఎక్స్పర్ట్స్ అయిన రమక్క వేణక్క లాంటి వాళ్ళ దగ్గర అట్టలు నలిగిపోయి కాస్త కాస్త వెలిసిపోతున్న లావుపాటి మూడొందల పేజీల ముగ్గుల పుస్తకాలుండేవి, వాళ్ళ అమ్మమ్మలు, అత్తయ్యల దగ్గరినుంచి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు. పొద్దున్న స్కూలుకెళ్ళేటప్పుడు ఎవరింటి ముందు కొత్త ముగ్గున్నా ఠకీమని ఆగిపోడం, బాగ్ లోనుంచి నలభై పేజీల ముగ్గుల పుస్తకం తియ్యడం, ఆ ముగ్గు కాపీ చేసుకోడం - "అక్కా, లేట్ ఐపోతోందే, మేస్టారు కొడతారే, రావే" అని పక్కనుంచి తమ్ముడు ఎంత మొరపెట్టుకున్నా వాడి గోడు వినపడితే కదా. ముగ్గుల్లో ఉన్న మజా అలాంటిది.



భోగి ముందు రోజున, నెలంతా పెట్టుకున్న గొబ్బిళ్ళతో చేసిన పిడకలతో పెద్ద పెద్ద దండలు చేసేవాళ్ళం. భోగినాడు సాయంకాలం భోగిపళ్ళ పేరంటాలు. రేగుపళ్ళు, ఐదుపైసల కాసులు ఎన్ని దొరికితే అంత రిచ్. భోగిపేరంటాల్లో దొరికిన డబ్బు ఒక్కోసారి నెలంతా సరిపోయేది నువ్వుజీళ్ళు కొనుక్కోడానికి. ఆ రోజులే వేరు. పిల్లల పండగ భోగి వరకే. సంక్రాంతి కనుమ ముక్కనుమ పెద్దాళ్ళ పండగలు. వీధుల్లో చేరి ఆడుకోడం, గారెలు బూరెలు తినడం తప్ప పిల్లలకి పెద్ద విశేషమేమీ ఉండేది కాదు. ముక్కనుమ నాడు సాయంకాలం మాత్రం నల్లని జీమూతశకలం లాగ ఒక దిగులు పిల్లలందరి మొహాల మీదా ఆడుతూ ఉండేది. తెల్లారితే మళ్ళీ బళ్ళు తెరిచేస్తారు. అంతే కాదు, సెలవలకి ముందు జరిగిన మూడో యూనిట్ టెస్ట్ తాలూకు పేపర్లు, మార్కులు ఇస్తారు కూడా. సత్యభామ సుభద్ర లాంటి చదువుకునే అమ్మాయిల సంగతి ఎలా ఉన్నా, వెంకట్రావు శీను లాంటి బండబ్బాయిలకి ఇది ఘోరకలిగాను అక్రమం లాగాను అనిపించేది - సంక్రాంతి సెలవల్లాంటి స్వర్గాన్ని ఆనుకునే ఇంతటి నరకం ఉండటం.



ఈ బాధెంత సేపో ఉండేది కాదులే. స్కూళ్ళు తెరిచిన రెండోరోజుకే మరుపొచ్చేసేది. స్నేహితులతో రోజూ ఆడే ఆటల ముందు యేడాదికోసారొచ్చే సంక్రాంతి శెలవలెంత!