భూతాన్ని ప్రసన్నం చేసుకుని రూపాయలు సంపాయించేద్దామని ప్లాన్ వేసిన డబ్బారేకుల సుబ్బారావు,
హనుమంతుల వారికి పన్నెండులక్షల ముఫ్ఫైఆరువేల రెండొందల పధ్నాలుగు కొబ్బరికాయలు బాకీ ఉన్న రాధాయ,
"ఏం గసురుతున్నావు? నీ ముగుణ్ణనుకున్నావా ఏం?" అని వాళ్ళమ్మని ఎదురు గదమాయించే బుడుగు,
రాఛ్ఛసుణ్ణి నడ్డి మీద చంపేసి రాకుమారిని రష్చించేసిన బుడుగు,
పదమూడో ఎక్కం, సీరాముని దైచేతను గబగబా అప్పచెప్పేసిన బుడుగు,
ప్రెవేటు మాష్టారికే ఎదురు ప్రెవేటు చెప్పేసి బుడుగుని కొంగుచాటున దాచేసిన బామ్మ, (పాపం డెనిస్ కి ఇలాంటి బామ్మ లేదు)
అందానికీ ముగ్ధత్వానికీ అమాయకత్వం కలగలిపిన ఆరిందాతనానికీ చెరగని చిరునామా రాధమ్మ,
"ఫలానా తారడు ఫలానా తారదీ ఒకరికొకరు ఏమవుతారు ఎడిటర్జీ?" అని సినీపత్రికలకి ఉత్తరాల్రాసే బుడుగూ వాళ్ళ బాబాయి,
ఒక తరం పాటు కార్టూనిస్టులకి కావలసినంత మేత అందించిన లావుపాటి పక్కింటి పిన్నిగారు,
బుడుగు బాధితుడు నంబర్ వన్ పక్కింటి పిన్నిగారి ముగుడు,
"ఛీ పోదురూ" అని సిగ్గుపడేసే సిగాన పెసూనాంబ,
తలచుట్టూ పచ్చటి చక్రం ఉందేమో వెతికి చూడ బుధ్ధయ్యే కాటుక కళ్ళమ్మాయి సుబ్బులు,
"బావుల్లాయి బుగ్గులు" అని బారెడు పొద్దెక్కాక ఆవులిస్తూ లేచి ముగ్గుల్ని ఆస్వాదిస్తూ మొహం కడిగే రావుడు,
స్వయంవర సభలో సిగ్గు పడుతూ వరమాల పట్టుకు నిలుచున్న సీతమ్మ,
గంభీర స్నిగ్ధ మందహాస ముఖారవిందుడైన రామయ్య,
పుట్టినరోజు కానుక చెయ్యాలని తపన పడే గోపన్న,
డికెష్టీ వాడు,
జెట్కా వాడు,
విగ్గులేని యముడు,
రెండో నంబరు ప్రద్యుమ్నుడు,
కొత్త డైలాగులు రాయించుకున్న గిరీశం,
మగదక్షత,
సినీ భేతాళుడు,
అమాయక విక్రమార్కుడు,
జనతా ఎక్స్ ప్రెస్ లో పంచవటి జనాభా,
"హలో, ఓ ఫైవుందా?" అని సరదాగా పలకరించే అప్పారావు,
రెండుజెళ్ళ సీతలు, ప్రభావతులు,
భగ్నవీణలూ, బాష్పకణాలూ,
ముత్యాల ముగ్గులు, గోరంత దీపాలు,
అందాల రాముడు, శ్రీనాథ కవిసార్వభౌముడు,
.
.
.
.
.
.
.
.
"హాయిగా...ఇల సాటి లేని జంటగా" ఉన్న జీవితకాల సహచరుడు బాపు,
అంతా బావురుమంటున్నారు... రమణగారూ, వదిలేసి వెళ్ళిపోయారెందుకని.