03 December 2010

కృతఙ్ఞత

"ఇప్పుడు చిట్టి ఒక పాట పాడుతుంది" అని చెప్పి శర్మ మాస్టారు చిట్టి వైపు చూశారు. స్కూల్ గ్రౌండ్ లో పిల్లలంతా బుధ్ధిగా వరసల్లో కూర్చుని ఉన్నారు. ప్రతీ గురువారం ఆ స్కూల్లో సాయంకాలం క్లాసులన్నీ అయిపోయాక ఒక గంటసేపు జరిగే వినోద కార్యక్రమం అది. పిల్లలు పాటలు, పద్యాలు, నాటికలు, డాన్సులు, ఇలా వాళ్ళకేదొస్తే అది మిగిలిన వాళ్ళందరి ముందూ ప్రదర్శించే రోజు. ఆరోజు కోసం వారమంతా ఎదురుచూస్తారంతా.

చిట్టి మెల్లిగా నడుచుకుంటూ వచ్చి టేబుల్ కి ఆనుకుని నిలబడి, పాట పాడటానికి గొంతు సవరించుకుంది. "ముందుకి వెళ్ళి నిలబడు చిట్టీ, అందరికీ కనపడేలా," అన్నారు టేబుల్ వెనకాల కూర్చున్న సుందరీ టీచర్ గారు. వెనక్కి తిరిగి ఆవిడకేసి ఒకసారి చూసి కళ్ళు దించుకుందే కానీ ముందుకి వెళ్ళలేదు చిట్టి. టేబుల్ ని ఆనుకునే పాట మొత్తం పూర్తి చేసింది. పాట పూర్తయ్యాక వెనక్కి అడుగులేసుకుంటూ వెళ్ళిపోయింది.

ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా పుస్తకాల బాగ్ ను వెనక్కి కిందదాకా వేలాడేసుకుని తల దించుకుని అడుగులో అడుగేసుకుంటూ ఎవరితోనూ మాట్లాడకుండానే వెళ్ళింది. కల్యాణి వంట పూర్తి చేసి హిందీ పుస్తకాలు ముందు వేసుకుని చదువుకుంటూండగా చిట్టి పక్కన చేరింది. "అమ్మా, కొత్త స్కర్ట్ కుట్టించవూ?" అనడిగింది చిట్టి కల్యాణిని. "కొత్త బట్టలు ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కోరు చిట్టీ, దీపావళి పండగ వస్తుందిగా, అప్పుడు కుట్టిస్తాను, ఏం?" అంది కల్యాణి. "నా యూనిఫాం స్కర్ట్ వెనకాల అంతా చినిగిపోయింది, రంగమ్మత్తయ్యగారు వాళ్ళ వాణి నాస్కర్ట్ చూసి నవ్విందివాళ. నాకిప్పుడే కొత్త స్కర్ట్ కావాలి" అంది చిట్టి ఏడుపు ఆపుకుంటున్న గొంతుతో. "ఇంకో స్కర్ట్ ఉంది కదా, దీపావళి వరకు రోజూ అదే వేసుకో. రోజూ సాయంకాలం పూట ఇంటికి రాగానే ఉతికి ఆరేస్తాన్లే, తల్లివి కదూ" అనునయించింది కల్యాణి. మౌనంగా తలూపింది చిట్టి.

ఉన్నట్టుండి కొత్త బట్టలు కొనాలంటే అమ్మకెంత కష్టమో చిట్టికి తెలుసు. కల్యాణి స్కూల్ టీచర్. ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతాననీ కల్యాణిని వేధించి సాధించి పెళ్ళి చేసుకున్నాడు రాఘవరావు. రెండేళ్ళు కల్యాణిని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు కూడా. తరువాత పేకాట, మందు, స్నేహితులు, ఎక్కువైపోయి ఇల్లూ, కల్యాణి కనపడ్డం మానేసాయి. చిట్టి పుట్టేసరికి బాంక్ బాలన్సంతా కరిగిపోయి ఉన్న కార్ అమ్మేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కల్యాణి ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల సంసారం వీధిన పడిపోలేదు. కరణాల ఇంట్లో పుట్టి సిరిసంపదల్లో పెరిగిన కల్యాణి, పుట్టింటివారికి తన సంసారం గొడవలేమీ తెలియకుండా అభిమానంతో నెట్టుకొస్తోంది. చిట్టికి నిద్ర రావడం మొదలయ్యింది. చదువుకుంటున్న కల్యాణి వొళ్ళో తల పెట్టుకుని అలాగే పడుకుని నిద్రపోయింది.

ఆదివారం వచ్చింది. హోంవర్క్ అంతా చేసేసుకుని, భోంచేసి, మధ్యాన్నం రెండింటికి ఆడుకోడానికని సుబ్బలక్ష్మి వాళ్ళింటికి బయలుదేరింది చిట్టి. కాలవ గట్టున నడుచుకుంటూ వెడుతోంది. చాకి రేవులు దాటింది. బానలన్నీ దాటగానే కనపడింది ఒక పెద్ద కుక్క. సింహంలా అంత ఎత్తున ఇంత లావున నల్లగా ఉంది. చిట్టిని చూడగానే అది గుర్రుమంటూ పళ్ళు బయట పెట్టింది. చిట్టికి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. భయంతో పరిగెట్టడం మొదలెట్టింది. ఆ కుక్క చిట్టి వెంటపడింది. అరనిముషంలో చిట్టి కాలుని నోటితో పట్టేసుకుందా కుక్క. చిట్టి కెవ్వుమని ఏడుస్తూ పెనుగులాడబోయింది. ఆ సందట్లో జీర్ణావస్థలో ఉన్న యూనిఫాం స్కర్ట్ కాస్తా కుక్క నోట్లో ఉండిపోయింది. ఈ లోపు ఆ పక్కనే ఉన్న చాకలి వాడొకడు పరిగెట్టుకుంటూ వచ్చి కర్రతో కుక్కని అదిల్చాడు. వెక్కుతూ, కళ్ళు తుడుచుకుంటూ పక్కనే ఉన్న సుబ్బలక్ష్మి వాళ్ళ ఇంటికి చేరుకుంది చిట్టి. సుబ్బలక్ష్మి వాళ్ళమ్మ లక్ష్మీకాంతమ్మ గారు చిట్టిని చూసి జాలిపడి, కాలు కడిగి డెట్టాలు రాసి కట్టు కట్టారు. చిట్టి మొహం కూడా కడిగి, తినడానికి ఖర్జూరం పండొకటి పెట్టారు. "అయ్యో, కుక్క స్కర్ట్ ని చింపేసిందే! ఆదివారం కదా, యూనిఫాం స్కర్ట్ ఎందుకేసుకున్నావే? మీ అమ్మగారు తిడతారని భయపడకు. నేను వేరే స్కర్ట్ ఇస్తాగా" అని చెప్పి లోపలికెళ్ళి సుబ్బలక్ష్మి చెల్లెలు శ్రీదేవిది ఒక యూనిఫాం స్కర్ట్ తెచ్చి చిట్టికిచ్చారు. కొత్తగా మెరిసిపోతోందది. దుక్కలా ఉన్న బిన్నీకాటన్ స్కర్ట్. పదేళ్ళు వాడినా చిరగనంత దళసరిగా ఉందది. "ఈ స్కర్ట్ రేపు మా అమ్మచేత ఉతికించి తిరిగి ఇచ్చేస్తాను" అంది చిట్టి. "తొందర లేదులే, వెళ్ళి ఆడుకోండింక" అనేసి ఆవిడ లోపలికెళ్ళిపోయారు. "ఇలాంటి స్కర్ట్ కొనమని చెప్పాలి అమ్మకి. పాలియెస్టర్ స్కర్ట్ లు యేడాదికే చిరిగిపోతాయి. ఈ స్కర్ట్ ఐతే జారుడుబండ ఎక్కి జారినా చిరగదు." అనుకుంది చిట్టి. ఆ స్కర్ట్ ని మరునాడు తిరిగి ఇచ్చెయ్యాలంటే దిగులుగా కూడా అనిపించింది. ఒక్కసారి తల విదిలించి, ఆటలో పడిపోయింది.

మరుసటి రోజు చిట్టికి వొళ్ళు తెలియని జ్వరం. కల్యాణి ఖంగారుపడి డాక్టర్ దగ్గరికి తీసుకెళితే చికెన్ పాక్స్ వచ్చిందని చెప్పింది డాక్టర్. చిట్టికి నయమయ్యి స్కూల్ కి వెళ్ళేసరికి రెండు నెలలయ్యింది. స్కూల్ కి వెళ్ళగానే తెలిసిన వార్త - సుబ్బలక్ష్మి, శ్రీదేవి వాళ్ళ నాన్నగారికి ఆ ఊరునుంచి బదిలీ అయ్యిందని, వాళ్ళు వారం రోజుల క్రిందటే ఊరెళ్ళిపోయారని. "అయ్యయ్యో, శ్రీదేవి స్కర్ట్ నా దగ్గర ఉండిపోయిందే" అనుకుంది చిట్టి, కొంత సంతోషంగానే.

మరునాడు స్కూల్ నుంచి ఇంటికొస్తూ రెండు నెల్లనుంచి ఖర్చు పెట్టకుండా భద్రంగా దాచుకున్న ఐదు పైసలు పెట్టి రెండు గ్లూకోజు బిస్కట్లు కొంది చిట్టి. చాకిరేవుల దగ్గరికెళ్ళి నల్లకుక్కని చూసి, దూరం నుంచే ఆ రెండు బిస్కెట్లూ దాని ముందుకి విసిరి ఇంటికి పరుగెత్తింది.