13 May 2013

చివరిమాట

"లోపలుంది, వెళ్ళి చూసి రా" అంది అమ్మ. కొత్త దుఃఖమేమీ కాదు. అమ్మమ్మకి వొంట్లో బావుండకపోడం రెండేళ్ళ క్రిందట మొదలయ్యింది. మూడు నెలల నుంచీ ఆస్పత్రి కి రాకపోకలు ఎక్కువైపోయాయి. పెద్దమ్మలు, మామయ్యలు, అత్తయ్యలు, పిన్ని, అందరూ బాధ పడీ పడీ సాచ్యురేట్ అయిపోయారు. ఇప్పుడు అమ్మమ్మ ఆస్పత్రిలోనే ఉంది, వారం రోజులుగా. డాక్టరు ఇవాళో రేపో అనేసాడు. ఈ మాట తెలిసి అమెరికా నుంచి చూడటానికి వచ్చాను నేను, ఆఖరి చూపులకి.

లోపలికి వెళ్ళాను. మంచం మీద రెక్కలు అలిసిపోయిన హంస లాగ పడుకుని ఉంది అమ్మమ్మ. దగ్గరికెళ్ళి పక్కనున్న కుర్చీలో కూర్చున్నా, అమ్మమ్మ చెయ్యి పట్టుకుని. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. "వచ్చావుటే?" తలూపాను. నాకు ఏదో చెప్పాలనుంది. ఇదే నా చివరి అవకాశం, తరువాత ఏమీ చెప్పలేను కావాలన్నా. "అమ్మమ్మా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకు, ఉండలేను" అన్నాను. నాటకీయంగా అనిపించకుండా తెలుగులో నా మనసుని ఎలా చెప్పాలో చేత కాలేదు. లోపల సముద్రపు అలల్లా భావాలు పొంగిపోతున్నాయి. ఒక రకమైన డెస్పరేషన్. మళ్ళీ అమ్మమ్మతో మాట్లాడగలనా? రైలు బయలుదేరేముందు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనే తొందర లాంటిదేదో కలుగుతోంది. అమెరికాలో ఏడేళ్ళ బట్టీ ఉన్నానేమో ఆ కల్చర్ కొంచం వంటబట్టింది. ఆప్తులతో క్వాలిటీ టైమ్ గడపడం, మనసులోని మాట సమయానికి సరిగ్గా వ్యక్తం చేయగలగడం ఇవన్నీ చాలా ముఖ్యమని నా అభిప్రాయం. అమ్మమ్మతో ఈ చివరి మాటలు నా జీవితాంతమూ గుర్తుంటాయి. కాబట్టి ఏదైనా మీనింగ్ ఫుల్ గా చెప్పాలి. అమ్మమ్మ నుంచి ఏదో ఒక మాట, నాకోసమే తను చెప్పే చివరి మాట వినాలని. ఇదే నా అలోచనంతా.

అమ్మమ్మ వింది. చిన్న చిరునవ్వు ఆవిడ మొహం మీద. "చలేస్తోంది ఈ దుప్పటి సరిగ్గా కప్పు. ఖర్జూరం పండు తినాలనుంది, వెళ్ళి పెద్ద మావయ్యకి చెప్పు" అంది. నేను తలూపి బయటకి వచ్చేసాను. పెద్ద మావయ్య, నాన్నగారు కూర్చుని కాఫీ తాగుతూ ఏదో మాట్లాడుకుంటున్నారు. అమ్మ అక్కడే ఉంది. సగం ఏడుపు సగం నవ్వుతో వెళ్ళి చెప్పా అమ్మమ్మకి ఖర్జూరం పండు కావాలిట అని. మావయ్య తేవడానికి వెళ్ళిపోయాడు. "అమ్మమ్మతో మాట్లాడావా?" అడిగారు నాన్నగారు. తలూపాను. "ఏమంది?" అడిగారు. "ఖర్జూరం పండు కావాలంది", చెప్పాను. అమ్మకి నా పరిస్థితి అర్ధం అయ్యింది. "మళ్ళీ వెళ్ళి మాట్లాడతావా అమ్మమ్మతో?" అడిగింది. అడ్డంగా తలూపాను. "ఇంటికి వెడతావా? అమ్మకి, పిన్నికి కారియరు పట్టుకురావాలి? పొద్దుటి నుంచీ వాళ్ళేమీ తినలేదు" అన్నారు నాన్నగారు. వెడతానన్నా. నాకు తెలుసు, అమ్మమ్మతో నా ఆఖరి మాటలు అయిపోయాయని. పార్కింగు లోంచి బయటికొచ్చేసరికి చీకటి పడుతోంది. నా మనసులో పుట్టెడు దిగులు.

అమ్మమ్మ... యేణ్ణర్థం పిల్లగా ఉన్నప్పుడు అమ్మ నన్ను అమ్మమ్మ దగ్గర వదిలింది. టెన్త్ అయ్యేవరకూ అమ్మమ్మ దగ్గరే పెరిగాను. నాకు అమ్మా నాన్నా మా అమ్మమ్మే. మా అమ్మమ్మ ఆ పల్లెటూళ్ళో అందరికీ నాయకమణి. పక్కింటి పిల్లాడికి జ్వరం వచ్చినా ఎదురింటి పిల్లకి కాన్పు వచ్చినా అమ్మమ్మ ఎక్స్పర్ట్ సలహా లేనిదే ఏమీ జరగదక్కడ. ఎవరి ఇంట్లోనైనా ఆడవాళ్ళ మధ్య తగువొస్తే తీర్పు తీర్చేది కూడా అమ్మమ్మే. సాయంకాలం పూట భాగవతమో భగవద్గీతో వినాలని చాలా మంది వచ్చేవాళ్ళు మా ఇంటికి. మా తాతయ్య కూడా వాళ్ళతో పాటు ఒక పక్కన కూర్చుని వినడమే తప్ప ఏమీ మాట్లాడేవారు కాదు. హరికథ చెప్పినట్టుండేది ఆవిడ భాగవతం చదివి చెప్తూంటే. పొద్దున్న లేస్తే ’కౌసల్యా సుప్రజా రామా’ తో మొదలయిన గొంతుకి రాత్రి ’హనూమంతం వృకోదరం’ తోనే విశ్రాంతి. అమ్మమ్మ మౌనంగా ఉండటం చూడలేదు నేనెప్పుడూను. అమ్మమ్మ వెంటే ఆవిడ మాట్లాడే మాటలు వింటూ, వెనకాలే అంటూ పెరిగాను నేను. మా మావయ్యల పిల్లలకెవరికీ నాకొచ్చిన భాషలో సగం కూడా రాదు. సెలవలకి అందరం కలిసినప్పుడు మా మావయ్యలు "ఎన్ని మాటలు నేర్చావే" అనేవారు నన్ను చూసి. మాటలొక్కటేనా? ఎన్ని పాటలు పాడేదని. నాకిన్ని మాటలు, పాటలు నేర్పిన అమ్మమ్మకి నేను ఏమీ చెప్పలేకపోయాను చివరి మాటగా. తను చివరి సారి నాతో ప్రేమగా చెప్పే మాటని విలువగా దాచుకోవాలని ఆశ పడ్డాను. ఖర్జూరం పండుని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు.

పొద్దున్న మావయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి - "అమ్మమ్మ మాట్లాడటం బాగా తగ్గిపోయిందే. ఇదివరకట్లా మాట్లాడట్లేదు. ఏమైనా కావాలంటే నోరు విప్పుతుంది, లేకపోతే లేదు". నాకన్ని మాటలు నేర్పిన అమ్మమ్మ. ఎందుకో ఒక్కసారి దిగులేసింది. మరుక్షణంలో మెరుపు మెరిసి మబ్బు విడినట్లయ్యింది. నేను మళ్ళీ లోపలికి వెళ్ళి అమ్మమ్మతో మాట్లాడకపోయినా పరవాలేదు. నేను నా చిన్నతనంలో మాటలు నేర్చింది మొదలు మేమిద్దరమూ మాట్లాడుకొంటూనే ఉన్నాము. కొన్ని కోట్ల మాటలు. అందులో ప్రేమని అపేక్షని వ్యక్తం చేసేవి కొన్ని లక్షలున్నాయి. జీవితంలో పనికొచ్చేవి దారి చూపించేవి కొన్ని వేల మాటలున్నాయి. ఆ మాటలన్నిటికీ తెర పడుతోందిప్పుడు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా నాకోసం ఒక కొత్త మాట చెప్పక్కర్లేదు అమ్మమ్మ. బోల్డు మాటలున్నాయి నాకు అమ్మమ్మ గుర్తుగా దాచుకోవాలంటే.

ఆవిడ ఆఖరి క్షణాలని నా దృక్పథంతో చూడదల్చుకోలేదు నేను. ఖర్జూరం పండు తిననీ అమ్మమ్మని.....

నాకు రోడ్డు కనపడట్లేదు.