మూడో యేడు నడుస్తోంది నాకప్పుడు. మాయాబజార్ సినిమా రెండో ఆటకి అందరం వెళుతూంటే, రేడియో ట్రాన్సిస్టర్ వెంట తెచ్చారు మా నాన్నగారు. కథామందారం శీర్షికలో వస్తున్న వడ్లగింజలు కథ తరువాయి భాగం మిస్ అవ్వకూడదని. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో అదీ నా మొదటి పరిచయం. ఆ ఙ్ఞాపకం వెంటనే మరుగున పడిపోయింది. మళ్ళీ శ్రీపాద వారి కథల సంపుటాలు చదవడం ఇంటర్మీడియెట్ లో ఏర్పడింది. వడ్ల గింజలు కథ చదువుతున్నాను. తంగిరాల శంకరప్ప పేరు చూడగానే ఎక్కడో విన్న ఙ్ఞాపకం. మధ్య, ప్రౌఢ అన్న మాటలూ, చదరంగపుటెత్తులు చదువుతూంటే మెరుపు కొట్టినట్టయ్యి, మరుగున పడ్డ చిన్నప్పటి స్మృతి తిరిగొచ్చింది. అదీ శ్రీపాద వారి కథ అంటే. ఒకసారి విన్న కథ జీవితాంతం మరుపుకి రాదు. అంత వైవిధ్యం, అలాంటి శిల్పం. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారన్నట్టు, "ఈ శతాబ్దంలో వచన రచనకి పెట్టింది పేరు ఇద్దరే - చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వెంకటశాస్త్రి గారి వచనం చదవకపోతే తెలుగువారికి తెలుగు రాదు. శ్రీపాద వారి కథలు విని ఉండకపోతే తెలుగుల ఉనికి అయోమయం".
తెలుగు కథకి శతజయంతి అని జరుపుకుంటున్నాం. ఈ శతజయంతి వ్యావహారిక తెలుగు కథకి. అంతకుముందు కథా ప్రక్రియ తెలుగు భాషలోనే లేదా అంటే, గ్రాంధిక భాషలో ఉంది. కథా సరిత్సాగరము, పంచతంత్రము లాంటివి గ్రాంధిక భాషలోకి అనువాదమయ్యాయి. వ్యావహారిక తెలుగు కథా ప్రక్రియని మనం పాశ్చాత్య సాహిత్యం నుంచి తెచ్చుకున్నాం. తెలుగులో చెయ్యి తిరిగిన కథకులంతా, ఆంగ్ల భాషని, పాశ్చాత్య సాహిత్యాన్నీ ఔపోసన పట్టి ఆకళించుకున్నవారే, సంప్రదాయవాదులైన విశ్వనాథ సత్యనారాయణ గారితో సహా. శ్రీపాద వారొక్కరే ఆంగ్ల భాష, ఆంగ్ల సాహిత్యపు ప్రభావం లేకుండా తెలుగు భాషలో కథలు వ్రాసిన రచయిత. ఆయన ఇంగ్లీషు నేర్చుకోలేదు. ఒక్క ఇంగ్లీషునే కాదు, హిందీని కూడా వ్యతిరేకించిన భాషాభిమాని. వారి అభిమానం దురభిమానం కానే కాదు. గట్టి కారణాలు, వాదమూ ఉన్నాయి దాని వెనుక. ఎలాంటి మనో భావాన్నైనా ప్రకటించడానికి కావలసిన పదజాలం, భావ శబలత, పుష్టి, పరిణతి, తెలుగు భాషలో ఉన్నాయి కనుక తెలుగు కంటే పరిణతిలో చిన్నదైన హిందీ వంటి భాషను మన భావాల మీద రుద్దవలసిన ఆగత్యం లేదని వారి అభిప్రాయం.
శ్రీపాదవారి కాలం విరుధ్ధ సంఘర్షణలకి ఆలవాలమైన సంధి కాలం. బ్రిటిష్ పాలన, ఇంగ్లీషు భాషా, కొత్త చదువులూ, పాశ్చాత్య సాహిత్య సంస్కారం, పారిశ్రామిక నాగరికత, బాడ్మింటను లాంటి కొత్త క్రీడలు, కోర్టులూ, ప్లీడర్లు, వ్యాజ్యాలు ఒక పక్కన సమాజాన్నేలుతుంటే, మరొక పక్క ఉపనయనాలూ, పంచశిఖలూ, మడీ, ప్రాయశ్చిత్తాలు, ఘటశ్రాధ్ధాలు, బాల్యవివాహాలు, విధవలని ఆకర్షించి వారి ఆస్తులకి ఎసరు పెట్టడాలు, బ్రూణ హత్యలు చేయించే పరిస్థితులకి నెట్టడాలు, చాంద్రాయణాలు, ఇతర అగ్రవర్ణాచారాలు, అగ్రవర్ణ దురహంకారము, అగ్రకుల రాజకీయాలు సృష్టించిన దుర్భర దళిత జీవితము సమాజాన్ని ఏలుతున్నాయి. హరికథలు, పెళ్ళిళ్ళలో మేజువాణీలు చేసే సానుల భామాకలాపాలు, సినిమాలు, నాటకాలు తెలుగు కళారంగాన్ని ఏలుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విరుధ్ధ సంస్కారాల మధ్య గురజాడవారు రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. వారి ఆధునిక దృష్టిని పూర్తిగా అందుకోలేకపోయినా, ఆయన వెనుకే కందుకూరి వీరేశలింగం పంతులు సంస్కరణభావాలకు సన్నిహితంగా కనపడతారు.
ఈ సంస్కరణోద్యమ కాలం మన శ్రీపాదవారి రచనా వ్యాసంగానికి వొరవడి పెట్టిన కాలం. ఈ ఉద్యమంలోని పరిమిత లక్ష్యాలను (ఒక్క వేశ్యల విషయంలో తప్ప) నమ్మిన సాహిత్యకారుడు శ్రీపాదవారు. ఆయన కందుకూరి మార్గంలో బహుముఖంగా రచనలు చేసారు. పండితుడిగా, పద్యకావ్య రచయితగా, విమర్శకుడిగా, చారిత్రక, శ్రవ్య, సాంఘిక, నాటక, నాటికా కర్తగా, నవలాకారుడిగా, అనువాదకుడిగా, వైద్యగ్రంథకర్తగా, వాచక రచయితగా, పత్రికా సంపాదకుడిగా, పాత్రికేయుడిగా, కథా రచయితగా, స్వీయ చరిత్రకారుడిగా, శ్రీపాదవారు బహుముఖ ప్రఙ్ఞాశాలి.
శ్రీపాదవారు వ్యావహారిక భాషా ప్రచారానికి చేసిన కృషి చాలా గొప్పది. వచన సాహిత్యంలో అభ్యుదయోద్యమం తలెత్తడానికీ, బలపడటానికీ పరోక్ష కారకుడయ్యి కొడవగంటి కుటుంబరావు వంటి వారి మార్గాన్ని సుగమం చేసారు. శ్రీపాదవారి కృషి వెనుక కొన్ని విశిష్టతలున్నాయి అవేంటంటే -
1. ఆయనది సరళమైన గ్రామీణ మనస్తత్వం.
2. ఆయనవి మాండలిక జీవితానుభవాలు.
3. ఆయనకు జాతీయోద్యమంలోని భాషా రాజకీయాలతోనూ, కులరాజకీయాలతోనూ పేచీ ఉంది.
4. ఆయనది వైదిక విద్యలన్నీ విడిచిపెట్టి కొత్తదారి తొక్కగలిగిన ఆత్మశక్తి.
5. ఆయనకి లోకవృత్తం సూక్ష్మాతి సూక్ష్మంగా పరకాయించుకుంటూ ఉండాలన్న తెలివి ఉంది.
6. తెలుగు భాషా ప్రయోగ వి~గ్ౙానమంతా స్త్రీల వల్లనే అలవడిందనే భాషా పరిశీలక దృష్టి ఉంది.
ఈ అంశాల వల్ల భావాల్లో కందుకూరికీ, భాషలో గురజాడకీ చేరువయ్యారు. వాస్తవికతకు చేరువగా ఉండే వీరి కథలు వినోదానికి చదువుకుని పక్కన పడేసే కథలు కావు. జీవితంలో సందిగ్ధావస్థ కలిగినప్పుడు దీపాల్లాగా వెలిగి మార్గనిర్దేశం చేసే పటిమ కలిగిన కథలు.
ఇక వీరి కథల విషయానికి వస్తే, కులజాడ్యాన్ని వ్యతిరేకిస్తూ దయకి సమతకి పెద్దపీట వేసిన కథలెన్నో వ్రాసారు వీరు. మూర్ఖంగా అచారాలనే పట్టుకుని వేళ్ళాడుతూ ఆచారాల వెనుక అసలు పరమార్థమైన నైతిక జీవనాన్ని విడిచి పెట్టేసిన ప్రబుద్ధులని వీరి కథల్లో చీల్చి చెండాడారు. స్త్రీవాదం అన్న పదమింకా పుట్టని రోజుల్లోనే స్త్రీల పరిస్థితుల మీదా, వారు చేపూనవలసిన బాధ్యతల మీదా, స్త్రీలను శక్తివంతులని చేయటం మీదా, అంటే empowerment of women గురించి ఎన్నో కథలు వ్రాసారు. దయా దాక్షిణ్యం లేకుండా కన్నవారే విధవరాళ్ళైన కూతుళ్ళ పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని ఎత్తి చూపించారు. ప్రవహించడం ఆగిపోయి చెత్తా చెదారాన్ని తనలో చేర్చుకుంటే మందాకిని కూడా మురుగు కాలువ ఐపోక తప్పదని, వేదజడులైన ఛాందస బ్రాహ్మణులని హెచ్చరించారు.
ఇంతటి పురోగామి, ఇంతటి సంస్కర్త, ఇంతటి విప్లవకారుడు ఐనా శ్రీపాదవారు తమ సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని చిన్నబుచ్చలేదు. పెద్దాపురం రాజసంస్థానం మీద గురించి వారు రాసిన కథలు చదువుతుంటే, వొళ్ళు గరిపొడుస్తుంది. మన సంప్రదాయం, కళలు ఎంత ప్రాచీనమో, ఎంత మహోత్తుంగమో, ఎంత ఉజ్జ్వలమో మనకర్థమౌతుంది. నా మాట మీద నమ్మకం లేకపోతే "ప్రత్యక్ష శయ్య" అన్న కథ చదవండి. ఆత్మశుద్ధి లేని ఆచారాలని ఖండించారు కానీ శ్రీపాద వారు వేదాభిమానులు. అలాగే, ఇంగ్లీషు భాషనీ పరాయి పాలననీ ఖండించారే కానీ, ఇంగ్లీషువారి క్రమశిక్షణనీ, పరిశ్రమనీ, క్రిస్టియన్ మతంలోని సమానత్వాన్నీ భూతదయనీ శ్లాఘించారు.
శాస్త్రిగారి రచనలకి చిన్నకథ, పెద్దకథ, నవల అన్న మాటలు వాడటం అనవసరం. వాటి శిల్పాలను ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. మనం టెక్నిక్ అనేది ఆయన పాటించలేదు. ఆయన దృష్టిలో రచన చెయ్యటమంటే ఒక విందుభోజనం సిధ్ధం చెయ్యడంలాంటిది. ప్రతీ మాటా, ప్రతీ వాక్యమూ, ప్రతీ వివరమూ రుచ్యంగా ఉండాలి. పాఠకుడిని రసాప్లావితులని చెయ్యాలి. అసలీ "రుచ్యంగా ఉండటం" అన్నదే శ్రీపాద శైలీ నిర్మాణాల రహస్యం. ఈ శైలీనిర్మాణాలని, శైలీ శాస్త్రంతో పరిచయమున్న తెలుగు భాషా శాస్త్ర~గ్ౙులు ఎవరైనా పరిశీలిస్తే అది తెలుగు భాషకి, సాహిత్య విమర్శకి చాలా తోడ్పడుతుంది.
ఆయన రాసిన కథలని విభజిస్తే ఈ రకంగా ఉంటాయి -
* అగ్రకులాల ధాష్టీకాన్ని నిరశిస్తూ కథలు
* పరాయి భాష మోజులో పడి తెలుగుని, తెలుగుతనాన్నీ హేళన చేసేవాళ్ళకి చురకలేసే కథలు
* విధవలైన ఇంటాడపడుచుల కష్టాల మీద కథలు
* ఛాందసులకి వేదజడులకి కొరడా ఝళిపించే కథలు
* ధర్మ ప్రభువులైన రాజుల పాలన కబుర్ల కథలు
* అప్రతిమానమైన కళాకారుల, ప్రతిభావంతుల కథలు
* తమ శౌర్యంతో తెలుగు జాతికి వన్నె పెట్టిన వీరాంగనల కథలు
* పరిశ్రమకి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ కీ పెద్దపీట వేసి సోమరితనాన్ని తెగనాడిన కథలు
*తెలుగువారి ఆపేక్షలనీ, అంత:కరణలనీ పట్టి చూపించే కథలు
* స్త్రీవాదపు కథలు
* యువతీ యువకుల కొత్త దాంపత్య ధర్మాలను అందిపుచ్చుకున్న కథలు
* గడుసు కబుర్ల కథలు
* తెలుగు పోకడల కథలు
* ప్రతీ మాటా తేనె పట్టులా ఉండే కథలు
ఆయన రాసిన కథలు ఇంచుమించు లెక్కలేనన్ని. అన్నీ మేలుజాతి వజ్రాలు. చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన. విద్యాబుధ్ధులున్న అహంకారులకు కనువిప్పు చేసేది ఆయన వచనము. ఆయన రచనలు మరో భాషకు లొంగవు. జాను తెలుగు నేర్చినవారికీ, తెలుగువారైనవారికే శ్రీ శాస్త్రి గారి కథలు చదివి ఆనందించే అదృష్టము. గురజాడ తదనంతరంలో శ్రీపాదవారు "జాతి"కథకులు.